- బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు ఫైర్
- ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సభను స్తంభింపజేస్తామని వార్నింగ్
హైదరాబాద్, వెలుగు: పాలన చేతకాక, ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుంటే ఆ ఫ్రస్ట్రేషన్‌లో కేసీఆర్ రాజీనామా అంటూ సీఎం రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్‌కు తెరదీశారని బీఆర్‌ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు ఫైర్ అయ్యారు. దేవుళ్ల మీద ఒట్లు పెట్టి రుణమాఫీ ఎగ్గొట్టినందుకు, ఆరు గ్యారెంటీలు అమలు చేయనందుకు ముందు రాజీనామా చేయాల్సింది రేవంత్ రెడ్డేనని అన్నారు. కేసీఆర్గురించి మాట్లాడే నైతికత రేవంత్‌కు లేదని వ్యాఖ్యానించారు.
ఆదివారం ఎర్రవల్లిలో కేసీఆర్‌తో బీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశం అనంతరం హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీలో సీఎం హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి వాడుతున్న భాషను చూసి సభ్యసమాజం తలదించుకుంటున్నదని, అలాంటి గౌరవం లేని సభకు కేసీఆర్ రావాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఈ చిల్లర ముఖ్యమంత్రితో చర్చల్లో పాల్గొనాల్సిన అవసరం కేసీఆర్‌కు లేదని పార్టీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలమంతా తీర్మానించామన్నారు.
కేసీఆర్ తయారు చేసిన సైనికులం తామున్నామని, తమ ప్రశ్నలకు సమాధానం చెప్పే సత్తా రేవంత్ రెడ్డికి లేదని పేర్కొన్నారు. ప్రతిపక్ష నాయకుడు, రెండుసార్లు ముఖ్యమంత్రిగా చేసిన కేసీఆర్ భద్రత మీద రేవంత్ రెడ్డికి ఏడుపెందుకని ప్రశ్నించారు. పక్క రాష్ట్రం ఏపీలో మాజీ సీఎంలకు భద్రత కల్పించడం లేదా? అని అడిగారు. కనీసం వార్డు మెంబర్ కూడా కాని సీఎం తమ్ముడు తిరుపతిరెడ్డికి నలుగురు గన్‌మెన్లు పెట్టి, భద్రత కోసం రూ.40 కోట్లు ఎలా ఖర్చు పెడుతున్నారో రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
వెయ్యి రోజుల్లో ప్రజలకు మిగిలింది ద్రోహమే
కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు తీరని ద్రోహమే మిగిలిందని హరీశ్ రావు అన్నారు. ప్రజా సమస్యల మీద సమగ్రంగా చర్చించడానికి కనీసం నెల రోజులపాటు అసెంబ్లీ సమావేశాలు నడపాలని బీఏసీ సమావేశంలో డిమాండ్ చేస్తామని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు వద్ద నీళ్లున్నా కావాలనే ఎత్తిపోతలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను ఏడిపిస్తోందని ఫైర్ అయ్యారు. 22ఏ కింద వ్యవసాయ భూములను నిషేధిత జాబితాలో పెట్టి రైతులను ఇబ్బంది పెడుతున్న తీరుపై, కరెంట్ కోతలు, రుణమాఫీ వైఫల్యం, పాలిటెక్నిక్ జీవో 97 రద్దు, సింగరేణి కుంభకోణాలు, పీఆర్సీ, డీఏలు, ఈహెచ్ఎస్ ఫెయిల్యూర్‌లాంటి అన్ని అంశాలపైనా అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని తెలిపారు.
రాష్ట్రంలో 30 లక్షల మంది విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించకపోవడం వల్ల వారి భవిష్యత్తు అంధకారమవుతోందని, విద్యార్థుల పక్షాన అవసరమైతే సభను స్తంభింపజేసైనా న్యాయం జరిగేదాకా కొట్లాడుతామని తెలిపారు. కాగా, ఇంజినీరింగ్, ఇతర డిగ్రీలు పూర్తి చేసినా.. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో కాలేజీ యాజమాన్యాలు వారి సర్టిఫికెట్లు ఇవ్వకుండా వేధిస్తున్నాయని విద్యార్థులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారని ‘ఎక్స్’ పోస్ట్‌లో పేర్కొన్నారు.
